•భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి12:
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 18న జరగనున్న మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి ఆయనతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఐ అధికారులకు సూచించారు. జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, ఎండ నుంచి ఉపశమనం కోసం చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.