– సమానత్వం మాటల్లోనేనా?
– ఓటు నుంచి పెళ్లివరకు కుల ప్రభావం
– మార్పు ఎప్పుడు మొదలవుతుంది?
జనవరి 4 (మనప్రజాప్రతినిధి):
దేశం ఆధునికత వైపు వేగంగా సాగుతున్నా సమాజాన్ని ఇంకా కనిపించని తాడు లాగుతున్నది కులమేనా? విద్య, ఉద్యోగాలు, పట్టణ జీవితం, సోషల్ మీడియా అనిపించినా కీలక నిర్ణయాల దగ్గరకు వచ్చేసరికి కులం ముందుకు రావడం వాస్తవంగా కనిపిస్తోంది. “మనం మారిపోయాం” అని అనుకునే స్థితి ఒకవైపు ఉంటే, ప్రవర్తనలో మాత్రం పాత ఆలోచనలే కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.రాజకీయ రంగంలో కుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, ఓటు బ్యాంకుల లెక్కల్లో కులమే కీలకంగా మారుతోంది. అభివృద్ధి, పాలన, విధానాల కంటే “మన కులం” అనే భావన ఓటును నిర్ణయిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. దీని ఫలితంగా సామర్థ్యం, పనితీరు పక్కకు నెట్టబడి గుర్తింపు రాజకీయాలు బలపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.సామాజిక జీవితంలోనూ కులం ప్రభావం తగ్గలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రేమ, స్నేహం స్వేచ్ఛగా కనిపించినా, పెళ్లి నిర్ణయాల దగ్గరికి వచ్చేసరికి కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందని యువత చెబుతోంది. ఆధునిక వేదికలైన మ్యాట్రిమోనియల్ యాప్స్‌లో కూడా కుల ప్రాధాన్యం కొనసాగుతుండటం సమాజంలో లోతుగా పాతుకుపోయిన వాస్తవాన్ని బయటపెడుతోంది.కులం పేరుతో అసమానతలు కొనసాగుతున్నంతకాలం సమానత్వం మాటలకే పరిమితమవుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. చట్టాలు, విధానాలు ఉన్నా ఆలోచనల్లో మార్పు రాకపోతే నిజమైన మార్పు సాధ్యం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. “మన కులం” కంటే “మన సమాజం” అనే భావన బలపడినప్పుడే కుల ప్రభావం తగ్గుతుందన్న సూచనలు వస్తున్నాయి. అప్పటివరకు ఈ ప్రశ్న ప్రజల ముందు నిలుస్తూనే ఉంటుంది. కులం ఇంకా మనల్ని నియంత్రిస్తోందా?