•సంక్రాంతికికార్మికుల ముఖాల్లోచిరునవ్వులు-సర్పంచ్ ఆదర్శ్
•పండగవేళ కార్మికులగుండెల్లో స్థానంసంపాదించిన సర్పంచ్
•ప్రజాప్రతినిధి అంటే ఇదే-సొంత నిధులతోవేతనాలు.
నర్సాపూర్.(మనప్రజాప్రతినిధి)జనవరి14
నర్సాపూర్ మండలం వెల్దుర్తి గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులకు సర్పంచ్ దండం ఆదర్శ్ తన సొంత నిధుల నుంచి వేతనాలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యంగా రావడంతో పండగ పూట కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సర్పంచ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.సంక్రాంతి పండుగను కార్మికులు సంతోషంగా, ఆత్మగౌరవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో తన వ్యక్తిగత నిధుల నుంచి వేతనాలు అందజేశారని తెలిపారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 12 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.9,500 చొప్పున జీతాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్మికులు సర్పంచ్ ఆదర్శ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయం గ్రామంలో ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజాప్రతినిధి అంటే ఇలానే ఉండాలని ప్రశంసలు కురిపించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.