manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 4:53 pm Editor : Mana Praja Prathinidhi

పారిశుద్ధ్య కార్మికుల కడుపు మంట-పంచాయతీ కార్యాలయంలో వంటా-వార్పు ఆందోళన

పండుగ ముందు జీతాల కరువు… ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల వినూత్న నిరసన.

పారిశుద్ధ్య కార్మికుల కడుపు మంట-పంచాయతీ కార్యాలయంలో వంటా-వార్పుఆందోళన
రేణిగుంటమండలం,జనవరి12(మనప్రజాప్రతినిధి):
మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పండుగ సమయం సమీపిస్తున్నప్పటి కీ చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పొయ్యిలు రాజేసి ‘వంటా-వార్పు’ కార్యక్రమం నిర్వహిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్నప్పటికీ మూడు నెలలుగా జీతాలు ఆపడం అన్యాయమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏఐటీయూసీ జిల్లా సెక్రెటరీ రేతారి రాధాకృష్ణ, శ్రీకాళహస్తి గౌరవ అధ్యక్షులు వై.ఎస్. మణి, మండల కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ… పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ బోనస్‌తో పాటు బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలని, కార్మికుల సమస్యలపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు.తమకు న్యాయం జరిగే వరకు నిరసన విరమించబోమని, అవసరమైతే మండల కేంద్రంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.