సంగారెడ్డి,జనవరి3(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజున ఆసుపత్రి ఆవరణలో మరోసారి దొంగతనం జరగడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ప్రత్యేకంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు సరైన భద్రత లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారిని వెంట తీసుకొచ్చిన సహాయకులకు చెందిన సెల్‌ఫోన్లు, పర్సులు, నగదు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు తరచుగా మాయమవుతున్నాయని బాధితులు వాపోతున్నారు.ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది కొరత, సీసీటీవీ పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఆరోగ్య సంస్థ అయిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రత లేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఆసుపత్రిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.