manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 1:35 pm Editor : Mana Praja Prathinidhi

క్రీడలు క్రమశిక్షణను పెంపొందిస్తాయి: ఫైనల్ మ్యాచ్‌లో పోలీసు అధికారుల సందేశం

క్రీడల్లోగెలుపు–ఓటములుసహజమే:జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం.
•మొగుడంపల్లిలో మండల్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఘనంగా నిర్వహణ

సంగారెడ్డి-మొగుడంపల్లి,జనవరి18(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో మండల్ లెవల్–2 క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ జనవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్థానిక సర్పంచ్ బి. రాజు, బి. విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కే. రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్, కోహీర్ ఎస్సై టి. నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ శివలింగం మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమేనని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో మంద గుబ్బడి తండా జట్టు వర్సెస్ గుడుపల్లి జెట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన మంద గుబ్బడి తండా జట్టు కెప్టెన్ రాథోడ్ రవీందర్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 15 ఓవర్లలో 158 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుడుపల్లి జెట్స్ జట్టు 15 ఓవర్లలో 126 పరుగులకే పరిమితమైంది. దీంతో మంద గుబ్బడి తండా జట్టు 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి. రాజు, ఉప సర్పంచ్ పి. సంజీవ్ రెడ్డి, కె. కిష్టయ్య, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.