manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 7:24 am Editor : Mana Praja Prathinidhi

మంచుతో కూడుకపోయిన సూరంపల్లి  చలితో వణికిన గ్రామ ప్రజలు

(మనప్రజాప్రతినిధి)//దౌల్తాబాద్:

దౌల్తాబాద్ మండలం, సూరంపల్లి గ్రామం లో గత రెండు రోజులుగా తీవ్ర చలి వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో గ్రామమంతా మంచు తుంపరలు కురిసినట్లు కనిపిస్తూ, పొలాలు, చెట్లు, రోడ్లు తెల్లటి పొరతో కప్పబడ్డాయి. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు (ఫాగ్) తీవ్రంగా కమ్ముకోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం పూట పొలాలకి వెళ్లే రైతులు మంచు కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై కనిపించేంతగా మంచు పేరుకుపోవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించారు.
గ్రామంలోని పశువులు కూడా చలి బారిన పడకుండా ఉండేందుకు రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంటలపై మంచు ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, వరి నారుమడి పంటలకు నష్టం కలగవచ్చని పేర్కొంటున్నారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు వెచ్చని దుస్తులు ధరించాలని, అవసరం లేకపోతే ఉదయం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.