manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 2:40 pm Editor : Mana Praja Prathinidhi

సొంత గ్రామంలో సీఎం అడుగులు… ఉత్సాహంతో నిండిన నారావారిపల్లె

అభివృద్ధి పనుల శంకుస్థాపన–ప్రారంభోత్సవాలతో ఉత్సాహం

నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు పర్యటన… కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి13
సొంత గ్రామమైన నారావారిపల్లెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ టిఫిన్స్, ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను సీఎం సందర్శించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహారం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలని సూచించారు.స్టాళ్ల వద్ద “నమస్తే సర్” అంటూ పలకరించిన అంగన్వాడీ చిన్నారుల వద్దకు సీఎం ప్రత్యేకంగా వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. షైనింగ్ సెంటర్స్ వల్ల పిల్లల్లో స్పష్టమైన ఎదుగుదల కనిపిస్తోందని మహిళలు సీఎంకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య ప్రమాణాల పెంపులో ఈ కార్యక్రమాలు కీలకమని సీఎం పేర్కొన్నారు.
అనంతరం రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను ప్రారంభించి యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. అలాగే రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్ ప్రారంభంతో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభించి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రూ.70 లక్షలతో నిర్మించిన ఎ–రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు రహదారిని ప్రారంభించారు.నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువు సహా మరో నాలుగు చెరువులకు నీటిని తరలించే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా సాగునీటి సమస్యలు తగ్గి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.