manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 8:01 am Editor : Mana Praja Prathinidhi

మట్టి మాఫియాపై చర్యలు తీసుకోకపోతే రోడ్డెక్కి ఆందోళన – సీపీఐ హెచ్చరిక

మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.జనవరి4
రేణిగుంట మండలంలో మట్టి మాఫియా దాడుల నుంచి రెవెన్యూ అధికారులకు తక్షణమే రక్షణ కల్పించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, రేణిగుంట మండల కార్యదర్శి వైయస్ మణి పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నాయని ఆరోపించారు. అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై రేణిగుంట మండలంలో మట్టి మాఫియా నాయకులు దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని విమర్శించారు.విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై దాడులు జరగడం ప్రజాస్వామ్య పాలనకు, పరిపాలనకు అవమానమని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులకే రక్షణ లేకపోతే పేద, మధ్యతరగతి ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్న మట్టి మాఫియా నాయకులపై కఠిన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం చూపిన లేదా మౌనంగా సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడించి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం వారి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ ఇసుక, మట్టి, గ్రావెల్ తరలింపులను అడ్డుకోవడంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు స్పందించి మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులకు సంపూర్ణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి రోడ్డెక్కి ఆందోళన, కలెక్టరేట్ ముట్టడి, రాస్తారోకో వంటి ఉద్యమాలు చేపడతామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.ప్రజా ఆస్తులు, సహజ వనరులను కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని, మట్టి మాఫియాకు అండగా నిలిచే వారెవరైనా సరే చట్టం ముందు బాధ్యత వహించాల్సిందేనని సీపీఐ నేతలు తేల్చిచెప్పారు.