manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 4:04 pm Editor : Mana Praja Prathinidhi

దుద్దెడలో ఘనంగా స్వయంభు శంభు దేవుని కల్యాణోత్సవాలు<br>

శివ-పార్వతుల కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కొండపాక మండలం(మనప్రజాప్రతినిధి):జనవరి3
కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో స్వయంభు శంభు దేవునిగా కొలువుదీరి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న దేవదేవుడు శివుని కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కీర్తిశేషులు గొల్లపల్లి రామచంద్ర మూర్తి శర్మ సూచించిన మార్గదర్శకత్వంలో, శ్రీ గొల్లపల్లి రఘురామ శర్మ, శ్రీ కోటా శ్రీనివాస శర్మల వైధిక నిర్వహణలో కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం శంభు దేవుని ఆలయ ప్రాంగణం లో ఆలయ ట్రస్ట్, సేవా సమితి సభ్యులు ఆవిష్కరించారు.ఈనెల 13వ తేదీ దశమి తిథి మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం పుణ్యాహవాచనం, అంకురార్పణ, మూలవిరాట్లకు అభిషేకం నిర్వహించనున్నారు. అదే రోజు గుడి చుట్టూ బళ్ళు తిరుగుట, శకతోత్సవం జరగనుంది.14వ తేదీ ఏకాదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, మూలవిరాట్లకు రుద్ర హోమం, చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి 8 గంటల నుంచి దిష్టికుంబాల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
15వ తేదీ ద్వాదశి రోజున ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి ఎదుర్కోలు నిర్వహించి, మధ్యాహ్నం 12:54 నిమిషాలకు అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన లోకకల్యాణార్థం శివ–పార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిపించనున్నట్లు తెలిపారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.అదే రోజు సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవంతో ఉత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ సేవా సమితి సభ్యులు తెలిపారు.