manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 9:00 am Editor : Mana Praja Prathinidhi

అల్మస్‌పూర్–జంగపల్లి–విరారెడ్డిపల్లిలో నూతన పాలకవర్గాలకు ఘన స్వాగతం

690 రోజుల తర్వాత గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగ గ్రామపంచాయ తీలకు కొత్త జీవం – నూతన సర్పంచ్‌ల సన్మానం

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి16
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని అల్మస్‌పూర్, జంగపల్లి, విరారెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జంగపల్లి హనుమాన్ యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.అల్మస్‌పూర్ గ్రామ సర్పంచ్‌గా మీరపురం పద్మ మల్లేశం,జంగపల్లి గ్రామ సర్పంచ్‌గా..పాతూరిలావణ్యనర్సింహారెడ్డి,విరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా చాట్లపల్లి బాలమల్లేశంగౌడ్ ఎన్నికయ్యారు.దాదాపు 690 రోజుల పాటు ఎన్నికైన పాలన లేక నిర్జీవంగా మారిన గ్రామపంచాయతీలకు నూతన పాలకవర్గాల రాకతో మళ్లీ ప్రజాస్వామ్య వెలుగులు విరాజిల్లాయి. గ్రామపంచాయతీ కార్యాలయాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తూ కళకళలాడాయి. ఎండిన నేలపై వాన పడినట్టుగా గ్రామాల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ సందర్భంగా హనుమాన్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, “గ్రామపంచాయతీ ప్రజాస్వామ్యానికి పునాది. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రజలిచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, అవినీతికి తావులేకుం డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. యువత నాయకత్వంలో గ్రామాలకు స్వర్ణభవిష్యత్తు సిద్ధమవుతుంది” అని పిలుపునిచ్చారు.
గ్రామపంచాయతీ నిధుల సక్రమ వినియోగం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, గ్రామస్తులసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరారు. గెలిచామన్న గర్వం లేకుండా, ఓడిపోయామన్న శత్రుత్వానికి తావులేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నూతన పాలకవర్గానికి హితవు పలికారు.ప్రస్తుత పాలకవర్గంలో సుమారు 60 శాతం యువత ఉండటం గ్రామాల భవితవ్యంపై మరింత ఆశాజనకంగా మారిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో అల్మస్‌పూర్, జంగపల్లి, విరారెడ్డిపల్లి గ్రామాల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.