-ప్రతి చిన్నారి చదువుకోవాలి
-అవగాహన సదస్సులో ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి బాద్యులు
నారాయణఖేడ్, జనవరి 31:
చదువే భవితకే బంగారు బాట వేస్తుందని,ప్రతి చిన్నారి చదువుకోవాలని,బాలల బాధ్యత ప్రభుత్వాలదే అని
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.ఖైసర్ అన్నారు.శనివారం వీధి బాలల దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ స్కూల్‌లో విద్యార్థుల హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..విద్య బాలల హక్కు అని, విద్యతోనే పిల్లల జీవితాలలో వెలుగులు నిండుతాయని,చదువే సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తి అని పేర్కొన్నారు. బాలలపై ఎలాంటి వివక్ష,బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని, పిల్లలకు విద్య, ఆరోగ్యం,భద్రత వంటి హక్కులు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.బాలల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గైనికాడి సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.