manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 4:05 am Posted by : Mana Praja Prathinidhi

పుణ్యక్షేత్ర ప్రతిష్ఠకు భంగం-కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి8
తిరుపతి జిల్లాలో, ముఖ్యంగా తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గమధ్యంలో గరుడ వారధి కింద జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది యువకులు బిక్షాటన పేరుతో తిరుపతి నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గరుడ వారధి కింద కొంతమంది వృద్ధులు జీవనోపాధి కోసం బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, అదే ప్రాంతంలో కొంతమంది యువకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితిలో నివాస కుటీరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వీరు పగలు, రాత్రి ఏమి పని చేస్తారో తెలియకపోవడం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నా యన్న విషయం స్పష్టంగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతంలో మద్యం సేవించడం, పేకాట ఆడటం, అనుచిత ప్రవర్తనకు పాల్పడటం వల్ల అక్కడి పరిస్థితి ఆందోళన కరంగా మారిందని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలను చూసే భక్తులు, మహిళలు, సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారని వారు పేర్కొన్నారు.ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పలు మార్లు పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటికీ, సంబంధిత వ్యక్తులు తప్పించుకొని మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో, ఇలాంటి వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుపతి పుణ్యక్షేత్ర ప్రతిష్ఠను కాపాడాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.