•హామీలు అమలు చేయలేక రైతులను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వం
•రైతుకు బరోసా లేదు… కాంగ్రెస్‌కు మాట మీద నిలకడ లేదు!
•రైతు బరోసా పథకంపై ప్రభుత్వ వైఖరిని నిలదీసిన సిద్దిపేట జిల్లా రైతులు
•మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.జనవరి21
ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.15,000 రైతు బరోసా అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలుపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి మాట్లాడుతూ, రైతు బరోసా పథకం ఎప్పుడు అమలవుతుందో, ఏ విధంగా అమలు చేస్తారో, రైతులకు డబ్బులు ఎప్పుడు అందుతాయో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు భరోసాగా ఉండాల్సిన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన ఉంటుందన్న నమ్మకంతో కాంగ్రెస్‌కు రైతులు అధికారం ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే రైతులను అయోమయానికి గురి చేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.రైతుల ఆశలు, విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండాలంటే రైతు బరోసా పథకం అమలుపై తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, ప్రతి సంవత్సరం ఏ తేదీ వరకు, ఎంత మొత్తాన్ని, ఏ విధంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారో అధికారికంగా వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు రక్షణ సమితి కమిటీ సభ్యులు.పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రాము రెడ్డి, దేవేందర్ రెడ్డి, మొత్క లక్షమయ్య, యాదన్రావు, సంతోష్ రెడ్డి, భూపతి రెడ్డి పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.