గుంటూరు జనవరి 4 ( మనప్రజాప్రతినిధి):
యావత్ భారత్ జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ పేర్కొన్నారు.లక్ష్మీపురం జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న,మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవంలో,గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర,పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి,తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్,టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు,జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.దేశానికి మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించి 60 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా పనిచేసి అజాతశత్రువుగా నిలిచిన వ్యక్తి వాజపేయి అని కొనియాడారు. 1998లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి దేశాన్ని ప్రబల శక్తిగా మార్చారన్నారు. అలాగే లాహోర్ బస్సుయాత్ర నిర్వహించి పాకిస్తాన్ తో పాటు పోరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కాంక్షించారన్నారూ. కేవలం పరిపాలకునిగా మాత్రమే కాకుండా, పార్టీకి నిబద్ధత కలిగిన వ్యక్తిగా పనిచేశారన్నారు. అలాగే ఆయన స్వయంగా కవి, హాస్య చతురత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అటువంటి మహానుభావుని వ్యక్తిత్వాన్ని విమర్శించిన వారు లేరంటే, అతిశయోక్తి కాదు. వాజపేయి ఆలోచన విధానాన్ని, పాలనా దక్షతను అందిపుచ్చుకొని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ,దేశభక్తికి, క్రమశిక్షణకు అంకితం అవుతుందని ప్రకటించారు. వాజ్ పేయ్ జీవితాన్ని ఆవిష్కరించారు.ఆయన దేశానికి చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.గుంటూరు నగరంలో ఆమహానీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.