–అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాల మూసివేత
– రేపటి నుంచి సాధారణ దర్శనాలు యథావిధిగా
తిరుమల, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు చివరి రోజు అని తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు ప్రకటించారు. ఈ రాత్రి ఏకాంత సేవ పూర్తైన అనంతరం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు తెలిపారు. దీంతో తొమ్మిది రోజులుగా కొనసాగిన ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం ముగియనుంది.
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా నమోదైంది. గత తొమ్మిది రోజుల్లో మొత్తం 7 లక్షల 9 వేల 831 మంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే 85 వేల 752 మంది భక్తులు దర్శనం చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ రద్దీని సక్రమంగా నియంత్రించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత రేపటి నుంచి ఆలయంలో అన్ని దర్శనాలు, సేవలు మళ్లీ యథావిధిగా కొనసాగనున్నాయి. సాధారణ సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
భక్తులు దర్శనాల షెడ్యూల్‌లో వచ్చిన ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆన్‌లైన్‌లో స్లాట్లు ముందుగానే బుక్ చేసుకోవాలని, దర్శన సమయాలను అధికారిక వేదికల ద్వారా చెక్ చేసుకుని తిరుమలకు రావాలని భక్తులకు సూచనలు జారీ చేసింది.