– ఫిబ్రవరి 5న తుది తీర్పు ప్రకటించనున్న హైకోర్టు
– సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీళ్లపై నిర్ణయం పెండింగ్
– నియామకాలు తుది తీర్పుకు లోబడి కొనసాగుతాయి
హైదరాబాద్, జనవరి 22 (మనప్రజాప్రతినిధి):
తెలంగాణ గ్రూప్–1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మరియు జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని పేర్కొంటూ వాయిదా వేస్తున్నట్లు కోర్టు పార్టీలకు తెలియజేసింది.ఈ అప్పీళ్లపై గత ఏడాది డిసెంబర్ 31న వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, సింగిల్ బెంచ్ జడ్జి నమవరపు రాజేశ్వర్ రావు సెప్టెంబర్ 9న ఫలితాలు, ర్యాంకుల జాబితాను రద్దు చేశారు. జవాబు పత్రాలను మ్యాన్యువల్‌గా పునఃమూల్యాంకనం చేయాలని లేదా ఎనిమిది నెలల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆదేశించారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో సవాలు చేశారు. విచారణ అనంతరం ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి, ఫలితాల ఆధారంగా నియామక ప్రక్రియను కొనసాగించేందుకు టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నియామకాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో టీజీపీఎస్సీ 563 పోస్టులకు గాను 562 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ మెయిన్స్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.