manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 11:50 am Posted by : Mana Praja Prathinidhi

ఏడాది నిరీక్షణకు తెర కొలనూర్ రామన్నపేట కల్వర్టు పనులు ప్రారంభం

మనప్రజాప్రతినిధి
రాజన్నసిరిసిల్ల
జనవరి ,07

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొలనూర్ – రామన్నపేట మధ్య కల్వర్టు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ పనులు బుధవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి.
నిజానికి ఈ కల్వర్టు నిర్మాణానికి ఏడాది క్రితమే ఆది శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. అయితే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరియు సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభం కావడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజల కష్టాలను గుర్తించిన ఆది శ్రీనివాస్ గారు, ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కల్వర్టు ప్రాధాన్యతను, ప్రజల ఇబ్బందులను వివరించడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో పనులకు లైన్ క్లియర్ అయ్యింది.

గ్రామస్తుల హర్షం

పనులు ప్రారంభం కావడంతో రామన్నపేట, కొలనూర్ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసి, నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు