manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 9:54 am Editor : Mana Praja Prathinidhi

వేములవాడ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

41 ఏళ్ల నిర్విరామ సేవలకు జాతీయ స్థాయి గౌరవం
మనప్రజాప్రతినిధి//వేములవాడ.జనవరి27
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) కు వేములవాడ పట్టణ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ బుర్ర ఎల్లయ్య గౌడ్ ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన 41 సంవత్సరాల అంకితభావ, సాహసోపేత సేవలను గుర్తిస్తూ ఈ అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.1985లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన ఎల్లయ్య గౌడ్, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు పొందారు. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందిన ఆయన విధి నిర్వహణలో ఎప్పుడూ ముందుండేవారు.తన సేవాకాలంలో అనేక సాహసోపేత ఆపరేషన్లలో పాల్గొన్న ఎల్లయ్య గౌడ్, 1992లో ఒక ఘటనలో ప్రాణాలను లెక్కచేయకుండా బావిలోకి దిగి ముగ్గురు ప్రాణాలను కాపాడడం ఆయన ధైర్యానికి నిదర్శనంగా నిలిచింది. నక్సల ప్రభావిత ప్రాంతాల్లో చాకచక్యంగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆయనకు 150 క్యాష్ రివార్డులు, 40 జీఎస్సీలు (GSCలు), సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, మహోన్నత సేవా పథకాలు లభించగా, తాజాగా ఇండియన్ పోలీస్ మెడల్ ఆయన ఖాతాలో చేరింది.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో పాటు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఎల్లయ్య గౌడ్‌ను ఘనంగా అభినందించారు. ప్రజలతో మమేకమవుతూ, పేదలకు అండగా నిలిచిన అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.