•మహిళల సాధికారతకు సొంత భవనం – వేపలమాధరంలో శంఖుస్థాపన
•మహిళా శక్తికి ప్రభుత్వ భరోసా – సంఘ భవన నిర్మాణానికి శ్రీకారం
•సమావేశాల ఇబ్బందులకు ముగింపు – మహిళా సంఘ భవనానికి నిధులు
మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు.ఫిబ్రవరి1
మేళ్లచెరువు మండల పరిధిలోని వేపలమాధరం గ్రామంలో మహిళల సాధికారత దిశగా కీలక అడుగు పడింది. గ్రామంలోని మహిళా శక్తి సంఘానికి నూతనంగా నిర్మించనున్న సంఘ భవనానికి శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల కనకయ్య, ఉపసర్పంచ్ మల్‌రెడ్డి కృష్ణారెడ్డితో పాటు స్థానికులు కొబ్బరికాయలు కొట్టి, భూమిపూజ చేసి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలు సమావేశాలు, చర్చలు నిర్వహించుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నూతన సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల కార్యకలాపాలకు, సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, ఏఈ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు.
గ్రామంలో మహిళా శక్తిని మరింత బలోపేతం చేసే ఈ నూతన సంఘ భవనం వేపలమాధరం గ్రామ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.