•గాంధీభవన్‌లో ఈ నెల 11న తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
సిద్దిపేట,మార్చి9(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఆదివాసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఆదివాసి ఇంచార్జి బండి శివకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 621 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ఐదుగురు ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, స్కూటీలు వంటి పథకాలు అందిస్తామని తెలిపారు.
రేపు జరగబోయే ఆదివాసి కాంగ్రెస్ సమావేశంలో ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ బూర్య (ఎమ్మెల్యే), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, ఆదివాసి ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ కమిటీ సభ్యులు, జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్లు, మండల చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎస్సీ సెల్ ఇంచార్జి కోదాది రమేష్, గడ్డం రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ కొమిడి రాజిరెడ్డి, కనకయ్య, చంద్రం, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.