•బైక్‌పై వెళ్తున్న తండ్రి–కూతురిపై విషాదం… సాన్విక అక్కడికక్కడే మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
•వేసవి సెలవులకు ఇంటికి వెళ్తుండగా లారీ ఢీ…తండ్రి ఆసుపత్రిలో చికిత్స.
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్24
వేసవి సెలవుల ఆనందం విషాదంగా మారింది. సొంత గ్రామానికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి సాన్విక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గురువారం రాజీవ్ రహదారిపై కొమురవెల్లి కమాన్ సమీపంలో చోటుచేసుకుంది.
కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బుర్ర రాజు కుమార్తె సాన్విక, ఎల్లాయిగూడ విజయలక్ష్మి స్టోన్ బ్రిడ్జ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. పాఠశాల చివరి రోజు ముగియడంతో సెలవుల కోసం తండ్రి రాజు కూతురిని తీసుకెళ్లేందుకు వచ్చాడు.
ఇద్దరూ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా… కొమురవెల్లి కమాన్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఢీ తీవ్రత అంతగా ఉండటంతో చిన్నారి సాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాజుకు తీవ్ర గాయాలు కాగా, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా రాజును సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.