manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 8:12 am Editor : Mana Praja Prathinidhi

అకాల వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం.

తడిసిన ధాన్యం కొనాలని రైతుల వేడుకోలు
•వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై రాస్తారోకో
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.మే28
ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు పలు మండలాల్లో అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. వరుణుడి ప్రతాపంతో కల్లాలలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయకపోతే తమ కష్టం మొత్తం వృథా అవుతుందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
అక్కిరెడ్డిపల్లి, బందారం, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వందలాది ధాన్యం సంచులు తడిచిపోయాయని రైతులు వాపోయారు. కవర్లు కప్పినా ధాన్యాన్ని కాపాడుకోలేకపోయామని, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“అష్టకష్టాలు పడి పండించిన పంట కొనుగోళ్లలోనే నీటిపాలవుతోంది. ట్రాక్టర్లు, కూలీలకు కిరాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. పంట అమ్ముకునేందుకు రోజంతా పనులు మానుకుని కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాల్సి వస్తోంది” అంటూ రైతులు తమ గోడును వెల్లగక్కారు.
రైతుల నిరసనతో రాజీవ్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.