manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 12:13 pm Editor : Mana Praja Prathinidhi

దొమ్మాట యువత ఆర్మీలో ఎంపిక

•ముగ్గురు యువకులకు సన్మానం చేసిన సర్పంచ్ అంజయ్య
మనప్రజాప్రతినిధి//దౌల్తాబాద్,మే31:
దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన భాషమైన అఖిల్, పొగాకు ప్రసాద్, బ్యాగరి రవీందర్ భారత ఆర్మీలో ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల గ్రామ సర్పంచ్ దేవిగారి అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు యువకులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఆర్మీ కోచింగ్ కోసం తనను సంప్రదించిన యువకులకు అవసరమైన సహకారం అందిస్తానని చెప్పానని, వారు తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ యువతకు వీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
దొమ్మాట గ్రామం నుంచి ఇప్పటికే ఏడుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు ఆర్మీ జవాన్లు విధులు నిర్వహిస్తున్నారని, తాజాగా మరో ముగ్గురు యువకులు ఆర్మీలో ఎంపిక కావడంతో గ్రామ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. యువత మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్ అహ్మద్, గ్రామ యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.