manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:45 pm Posted by : Mana Praja Prathinidhi

తెలంగాణ అమరవీరుల త్యాగాలకు నాటక రూపంలో నివాళి..

సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెస్‌మీట్
•మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్16
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ నినాదం – అమరవీరుల త్యాగాలు” నాటక ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నేటి తరానికి చేరవేసే లక్ష్యంతో ఈ నాటకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల యువ కళాకారులకు 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాటకాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పాటు రైతాంగ ఉద్యమాలు, నీళ్లు–నిధులు–నియామకాల కోసం సాగిన పోరాటాలు, విద్యార్థుల త్యాగాలను నాటకంలో ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
ఇటీవల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తన క్యాంపు కార్యాలయంలో నాటక బృంద సభ్యులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆయన సూచించినట్లు చెప్పారు.
భవిష్యత్తులో తెలంగాణ చరిత్రతో పాటు యువత సమస్యలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, మహిళా భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నాటకాలు, షార్ట్ ఫిల్మ్స్ రూపొందించనున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. జిల్లా స్థాయి కళాకారులు, నటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరింది.
ఈ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి కర్రోల్ల, పురుషోత్తం పటేల్, లింగంమూర్తి, సుప్రియ, సుగుణ, మన్నెమ్మ, భూమయ్య, రాకేష్, మోజేష్, ప్రభుజన్, స్వేచ్ఛ రెడ్డి, కనుక లక్ష్మి, దీపిక, శ్రీకృతి, చిరంజీవితో పాటు సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.