manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 4:21 pm Posted by : Mana Praja Prathinidhi

ట్రాక్టర్‌తో చెలగాటం.. డ్రైవర్ నిర్లక్ష్యానికి వాహనదారుల ఆగ్రహం

°ఇటుక లోడ్‌తో డ్రైవింగ్ సీటుపై నిలబడి ట్రాక్టర్ నడిపిన డ్రైవర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అక్బర్‌పేటభూంపల్లిమండల//మనప్రజాప్రతినిధి.జూన్30
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని ప్రధాన జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన స్థానికులను, వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను డ్రైవర్ డ్రైవింగ్ సీటుపై నిలబడి నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేయడం కలకలం రేపింది.
ఈ దృశ్యాలను అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.డ్రైవర్ నిర్లక్ష్యంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీ లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను ఇలాంటి ప్రమాదకర రీతిలో నడపడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయని వారు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత రవాణా, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ట్రాక్టర్ ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్లు, బీమా, అలాగే డ్రైవర్ లైసెన్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.