manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 10:04 pm Posted by : Mana Praja Prathinidhi

మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థుల అవగాహన ర్యాలీ

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: జిల్లా కలెక్టర్ హైమావతి

•అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం

సిద్దిపేటజిల్లా,జూన్26(మనప్రజాప్రతినిధి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర కో-ఎడ్యుకేషన్) ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, నషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “డ్రగ్స్ వద్దు – భవిష్యత్తు ముద్దు”, “మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ పలువురు విద్యార్థులు అవగాహన సందేశాలను అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తును సాధించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తమ పరిసరాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటు పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని ఆ అలవాటు నుంచి బయటపడేందుకు సహకరించాలని కోరారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని, అందువల్ల ప్రారంభ దశలోనే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్య, జిల్లా సంక్షేమ అధికారి శారద, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నగేష్ మాట్లాడుతూ యువతలో సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి విజిత, డీసీపీఓ రాము, చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ గణేష్, కళాశాల ఏజీఎంసీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్లు కనకచంద్రం, ఫాతిమా, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ అశోక్‌తో పాటు అధ్యాపకులు శ్రీకాంత్, సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, రఘురాజు, రాజశేఖర్, విజయభాస్కర్, రవి, విటల్, వెంకటేష్ తదితరులు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.