manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 9:41 am Posted by : Mana Praja Prathinidhi

సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ..వైభవంగా అన్నాభిషేకం

°మాసశివరాత్రి సందర్భంగా మర్పడగలోని సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా నిర్వహణ – భక్తులకు అన్నప్రసాద వితరణ
°వైభవంగా సంతాన మల్లికార్జునుడికి అన్నపూజ
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జూలై13
మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అన్నాభిషేకం, అన్నపూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరిగాయి.
బసవకళ్యాణ్ సదానంద మఠాధిపతి, గురు మదనానంద శారదా పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి క్షేత్రాన్ని సందర్శించి సంతాన మల్లికార్జున స్వామికి, శ్రీ విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఉదయం 6:30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అర్చకులు రుద్రపారాయణం, శ్రీసూక్త పారాయణం నిర్వహించారు. లఘున్యాస పూర్వకంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, ఫలరసాభిషేకం చేసి అన్నపూజ నిర్వహించారు. అనంతరం నీరాజనం, మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంపీడీఓ వేలేటి భాస్కరశర్మ, హోమియో వైద్యులు కాళీప్రసాద్, క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు మర్యాల రవీందర్, సురేందర్ రెడ్డి, గట్టు విఠల్, చీకోటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.