manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:12 am Posted by : Mana Praja Prathinidhi

బ్యాంకులు రైతుల వద్దకే వెళ్లాలి

భట్టి విక్రమార్క కీలక సూచనలు
వ్యవసాయ రుణాలే అభివృద్ధికి పునాది
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు బ్యాంకుల భాగస్వామ్యం
2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్ ప్రతిపాదన
హైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయంతో మాత్రమే ఈ లక్ష్యం సాధ్యం కాదని, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, విస్తృత ఆర్థిక మార్కెట్లు, వినూత్న ఆర్థిక వనరుల సమీకరణ అవసరమని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్–2047 కేవలం విజన్ పత్రం కాదని, తెలంగాణ ప్రజలతో కుదుర్చుకున్న అభివృద్ధి ఒప్పందమని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే బ్యాంకింగ్ రంగం కూడా సమాంతరంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు తమ వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు.
వ్యవసాయం, గ్రామీణ రంగాలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, రైతులకు అవసరమైన సమయంలోనే రుణాలు అందాలని అన్నారు. అర్హులైన రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, బ్యాంకింగ్ వ్యవస్థే రైతుల వద్దకు వెళ్లాలని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ, మత్స్యరంగం, ఉద్యానవనం, ఆయిల్‌పామ్, ఆహార ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాలను కూడా అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకురావాలని సూచించారు. రైతులకు రుణాలు ఇవ్వడమే లక్ష్యం కాకుండా, ఆ రుణాలు అధిక ఆదాయంగా మారేలా చర్యలు ఉండాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే కేవలం వసూళ్లపైనే దృష్టి పెట్టకుండా, ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించాలని బ్యాంకులకు సూచించారు. ఉత్పాదకత, మార్కెట్ సదుపాయాలు, పంట అనంతర మౌలిక వసతులు, వర్కింగ్ క్యాపిటల్ వంటి అంశాలను కూడా రుణ విధానాల్లో భాగం చేయాలని కోరారు. జూన్ 2026 నాటికి రూ.52,337 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసినందుకు బ్యాంకులను అభినందించిన ఆయన, రుణాల సకాల పంపిణీ కూడా అంతే ముఖ్యమని అన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు రుణం మంజూరు కావడం కంటే అవసరమైన సమయంలో నిధులు అందడం ముఖ్యమని చెప్పారు. దరఖాస్తు, మంజూరు, విడుదల ప్రక్రియలకు స్పష్టమైన గడువులు ఉండాలని ఆదేశించారు. ప్రస్తుత త్రైమాసికంలో క్రెడిట్ గ్యారంటీ పథకం కింద రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలకు ఆమోదం లభించడాన్ని స్వాగతించిన ఆయన, ఈ పథకం కింద రుణాలు పొందే పారిశ్రామికవేత్తలను తనఖాల పేరుతో ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులకు సూచించారు. తెలంగాణ రైజింగ్–2047లో పేర్కొన్న క్యూర్, ప్యూర్, రేర్ విధానాలకు అనుగుణంగా ప్రాంతాల వారీగా రుణ వ్యూహాలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. కృత్రిమ మేధస్సు, జీవ విజ్ఞానం, ఔషధ రంగం, విమానయాన, స్టార్టప్‌లకు అధునాతన ఆర్థిక సహాయం అందించాలని, తయారీ, గిడ్డంగులు, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణ రంగాలకు ప్రత్యేక రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, మత్స్యరంగం, పాడి పరిశ్రమలకు చౌకైన, సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా “తెలంగాణ రైజింగ్–2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్” రూపొందించాలని ప్రతిపాదిస్తూ, వ్యవసాయం, మహిళా పారిశ్రామికవేత్తలు, యువత ఉపాధి, హరిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఆర్థిక చేర్పు వంటి రంగాల్లో స్పష్టమైన వార్షిక లక్ష్యాలు ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు.