manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:54 pm Posted by : Mana Praja Prathinidhi

దినుష దెబ్బకు డ్రా.. భారత్‌కు నిరాశ!

కొలంబో,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి):  కొలంబో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో ముందంజ వేయాలనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఐదో రోజు భారత బౌలర్లు శ్రీలంక చివరి వికెట్‌ను పడగొట్టలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. సొనాల్ దినుష 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లంకను ఓటమి నుంచి తప్పించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0తో సొంతం చేసుకుంది.
తొలి రెండు రోజుల్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు కూడా భారత బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్‌లో విజయం ఖాయమనే పరిస్థితి కనిపించింది. అయితే శ్రీలంక బ్యాటర్లు పుంజుకుని భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన సొనాల్ దినుష.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు.
దినుష అద్భుత పోరాటం
ఐదో రోజు దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 264 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. నువాంత (46), లహిరు కుమార (12)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ శ్రీలంకను గట్టెక్కించాడు. టీ బ్రేక్‌ అనంతరం సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకుని జట్టుకు డ్రా ఆశలు కల్పించాడు.
429/9 వద్ద డిక్లేర్
చివరి బ్యాటర్ అసితా ఫెర్నాండో కూడా పట్టుదలగా ఆడటంతో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో శ్రీలంక 429/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆట ముగియడానికి మరో 17 ఓవర్లు మాత్రమే ఉండటంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లతో రాణించాడు. అంతకుముందు దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115) సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.