– పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన
– 22ఏ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ
– ప్రజావ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్
– హౌస్ అరెస్ట్ ఘటనను ఖండించిన బీజేపీ
హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి పాలకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 22ఏ అంశాన్ని ప్రస్తావించిన ఈటల రాజేందర్, 1965లో ఏర్పడిన ఆర్‌కే పురం కాలనీని 22ఏ జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయనే ప్రభుత్వ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రజాక్షేత్రంలోకి వచ్చి బాధితుల సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీవో నెంబర్ 97పై కూడా ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, అనేక మంది ఉన్నత విద్యలో కూడా రాణిస్తారని పేర్కొన్నారు. అలాంటి విద్యా వ్యవస్థను బలహీనపరిచేలా తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. జీవో 97 కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులను స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లోకి మళ్లించడం ద్వారా వారి విద్యా అవకాశాలు పరిమితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని కూడా ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లే నాయకులను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నిస్తే అది మరింత వ్యతిరేకతకు దారితీస్తుందని హెచ్చరించారు. జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగితే ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, పార్టీ నాయకులు మహిపాల్, మల్క యశస్వి, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.