manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:48 pm Posted by : Mana Praja Prathinidhi

అందానికే పరిమితం కావడం నాకిష్టం లేదు

హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): నటి ఎస్తర్‌ నోరోన్హా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘భీమవరం బుల్లోడు’ వంటి చిత్రాల్లో సంప్రదాయబద్ధమైన, హుందాగా కనిపించే పాత్రల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన, కాస్త బోల్డ్‌ పాత్రల్లోనూ కనిపించారు. దీంతో తన పాత్రల ఎంపికలో వచ్చిన మార్పుపై ఆమెకు పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్‌ ఆసక్తికరంగా స్పందించారు.
హీరో పక్కన అలంకరణ వస్తువులా ఉండను
తన ప్రయాణంలో మార్పుకు ప్రధాన కారణం వృత్తిపరమైన ఎదుగుదలేనని ఎస్తర్‌ తెలిపారు. ప్రస్తుత వాణిజ్య చిత్రాల్లో కథానాయికలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అభిప్రాయపడ్డారు. కథానాయకుడి పక్కన అందంగా కనిపించే పాత్రలకే పరిమితం చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తాను చదువుకున్న వ్యక్తినని, శిక్షణ పొందిన నటినని.. తనలోని నటనా ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
సవాలు చేసే పాత్రలకే ప్రాధాన్యం
తనను కేవలం అందానికే పరిమితం చేసే పాత్రలు చేయడానికి ఆసక్తి లేదని ఎస్తర్‌ చెప్పారు. మంచి కథ, బలమైన పాత్ర, నటనకు అవకాశం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. గతంలో ‘భీమవరం బుల్లోడు’ వంటి సినిమాల్లో తనకు గౌరవప్రదమైన, హుందా పాత్రలు లభించాయని గుర్తుచేశారు. అయితే ఒకే తరహా పాత్రల్లో కనిపించకుండా తనలోని విభిన్న నటనా కోణాలను ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నట్లు తెలిపారు.
మంచి అవకాశాలు రావడం అదృష్టమే
తాను నటించిన చిత్రాల్లో పెద్దగా నిరాశపరిచే సినిమాలు లేవని ఎస్తర్‌ పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలతో మంచి పాత్రలను తిరస్కరించడం తన పొరపాటేనని అన్నారు. ఎంతోమంది కళాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే ఒక్క మంచి పాత్ర కూడా దక్కదని, తనకు వరుసగా తన సామర్థ్యాన్ని పరీక్షించే పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తాను వెతుక్కోకుండానే మంచి అవకాశాలు తన వద్దకు వస్తున్నాయని, అందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ఎస్తర్‌ నోరోన్హా పేర్కొన్నారు.