manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 7:30 am Posted by : Mana Praja Prathinidhi

భారత్‌ నా రెండో ఇల్లు.. వాట్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

సిడ్నీ,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి):: ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించాడు. సొంత దేశం ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్‌లోనే తనకు ఎక్కువ ప్రేమాభిమానాలు, మద్దతు లభించాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలోని భారత కాన్సులేట్‌ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వాట్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే వారి సంఖ్య ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎంతో ఎక్కువని వాట్సన్‌ పేర్కొన్నాడు. భారత్‌లో తనను ఎవరూ పెద్దగా విమర్శించలేదని, అక్కడ ఎప్పుడూ లభించిన మద్దతును తాను మరువలేనని చెప్పాడు. ఆస్ట్రేలియాలో రాణించినప్పుడు ప్రశంసలు దక్కేవని, అయితే విఫలమైనప్పుడు విమర్శలు తప్పేవి కావని గుర్తు చేసుకున్నాడు. భారత్‌తో పాటు ఇక్కడి ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, తన వ్యక్తిగత జీవితం, క్రికెట్‌ కెరీర్‌పై భారత్‌ చెరగని ముద్ర వేసిందని కొనియాడాడు.
తాను 19 ఏళ్ల వయసులో తొలిసారి భారత్‌ను సందర్శించానని, అప్పటి నుంచి దేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని నిశితంగా గమనిస్తున్నానని వాట్సన్‌ తెలిపాడు. భారతీయ శాఖాహార వంటకాలంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు.
ఐపీఎల్‌ అద్భుతమైన వేదిక
2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తన కెరీర్‌ కీలక దశలో ఉన్న సమయంలో అద్భుతమైన వేదికను కల్పించిందని వాట్సన్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ తన క్రికెట్‌ ప్రయాణంలో ఎంతో కీలక పాత్ర పోషించిందని కృతజ్ఞతలు తెలిపాడు. వాట్సన్‌ 2008 నుంచి 2020 వరకు రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.