manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 7:35 am Posted by : Mana Praja Prathinidhi

హోంవర్క్ చేయలేదని మందలింపు.. విద్యార్థి మృతి

విశాఖలో విషాద ఘటన కలకలం
పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
విశాఖపట్నం,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదన్న కారణంగా టీచర్ మందలించడంతో యూకేజీ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ హోంవర్క్ పూర్తి చేయలేదన్న కారణంగా టీచర్ మందలించి కొట్టినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిపారు.
విద్యార్థి పరిస్థితి విషమించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి మృతితో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు చేపట్టాలని కోరారు.
మృతుడి తల్లి మాట్లాడుతూ తన కుమారుడి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో చిన్నారుల పట్ల ఇలాంటి వ్యవహారం పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. బాలుడి మరణానికి గల అసలు కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.