manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:31 pm Posted by : Mana Praja Prathinidhi

మణిపూర్‌లో ఉగ్రదాడి.. నలుగురు మృతి

°వాహనాన్ని అడ్డగించి కాల్పులు
°మరో వ్యక్తి ఆచూకీ గల్లంతు
°నాగా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత
°నిందితుల కోసం ముమ్మర గాలింపు

ఇంఫాల్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): తరచూ హింసాత్మక ఘటనలతో వార్తల్లో నిలిచే మణిపూర్‌లో మరోసారి రక్తపాతం చోటుచేసుకుంది. కాంగ్‌పోక్పి జిల్లాలోని మకుయి అషాంగ్–తబాంబా నాగా ప్రాంతాల మధ్య గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని సాయుధులు తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, సాయుధులైన దుండగులు ప్రయాణికులతో వెళ్తున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. వాహనంలో ఉన్న లియాంగ్మై నాగా తెగకు చెందిన నలుగురిని కాల్చిచంపారు. అనంతరం మరో వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతడి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సేనాపతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం ప్రత్యేక గాలింపు బృందాలను రంగంలోకి దించారు ఈ ఘటనతో నాగా తెగ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేస్తూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
దాడికి నిరసనగా స్థానికంగా ఉన్న దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌పీవో) బంద్‌కు పిలుపునివ్వడంతో సాధారణ జనజీవనం కొంత మేర ప్రభావితమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలు, బాధ్యులు ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. గల్లంతైన వ్యక్తిని సురక్షితంగా గుర్తించడంతో పాటు ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.