manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 7:08 am Posted by : Mana Praja Prathinidhi

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ వేడుక..

“రాఖీ ఓ దారం కాదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆత్మీయ బంధానికి ప్రతీక.”
రాఖీ దారంలో.. అనురాగ బంధంలో రాఖీ పౌర్ణమి.
రక్షణకు ప్రతీకగా రాఖీ-ప్రేమానురాగాలను పంచే పవిత్ర పండుగ
రిపోర్టర్ అంజి.మనప్రజాప్రతినిధి//ఆగస్టు28
అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. రక్షాబంధన్‌గా కూడా పిలిచే ఈ పండుగ ప్రతి ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహిస్తారు. సోదరి తన సోదరుడి క్షేమాన్ని, ఆయురారోగ్యాలను కోరుతూ రాఖీ కడితే.. సోదరుడు జీవితాంతం తనకు అండగా ఉంటానని, రక్షణగా నిలుస్తానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత.
రక్షాబంధన్ అంటే..
‘రక్ష’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధించడం అని అర్థం. సోదరి తన సోదరుడి మణికట్టుకు రక్షా సూత్రాన్ని కట్టి అతని క్షేమాన్ని కోరుతుంది. సోదరుడు కూడా తన సోదరికి ప్రేమతో కానుకలు అందిస్తూ, ఎల్లవేళలా అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. రక్త సంబంధం లేకపోయినా తమను అన్నదమ్ములుగా భావించే వారికి సైతం రాఖీ కట్టి ఆత్మీయ బంధాన్ని చాటుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
పురాణాల్లో రాఖీ ప్రస్తావన
రాఖీ పండుగకు సంబంధించి పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతం ప్రకారం.. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడి వేలికి గాయం కాగా రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. ద్రౌపది చూపిన ఆప్యాయతకు కృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తాడు. అనంతరం నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమెను కాపాడి తన మాటను నిలబెట్టుకుంటాడు. ఈ కథను రక్షాబంధన్‌కు సంబంధించిన ప్రముఖ పౌరాణిక కథగా చెబుతారు.
ఇంద్రుడికి ఇంద్రాణి రక్ష
మరో పురాణ కథనం ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయి శక్తిని కోల్పోతాడు. తన భర్త పరిస్థితిని చూసిన ఇంద్రాణి శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి ఇంద్రుడికి రక్ష కడుతుంది. అనంతరం దేవతలు కూడా రక్షా సూత్రాలు కట్టి ఇంద్రుడిని యుద్ధానికి పంపగా.. ఇంద్రుడు విజయం సాధించినట్లు పురాణ కథనం.
లక్ష్మీదేవి కట్టిన రాఖీ
మరో కథనం ప్రకారం మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళంలో ఉండిపోతాడు. తన భర్తను వైకుంఠానికి తీసుకురావడానికి లక్ష్మీదేవి పాతాళానికి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. అనంతరం తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకువచ్చినట్లు పురాణాల్లో పేర్కొంటారు. అలాగే సుభద్ర శ్రీకృష్ణుడికి రక్షాబంధనం కట్టినట్లు కూడా కథనాలు ఉన్నాయి.
రాఖీ వేడుకలు ఇలా..
రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు ఉదయాన్నే తలస్నానం చేసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాఖీ, అక్షింతలు, దీపం, మిఠాయిలను సిద్ధం చేసుకుంటారు. సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు ప్రేమతో కానుకలు అందజేస్తారు.
బంధాలను మరింత బలపరిచే పండుగ
ప్రస్తుత ఆధునిక కాలంలో ఆన్‌లైన్‌ ద్వారా శుభాకాంక్షలు, రాఖీలు పంపించుకోవడం సాధారణమైంది. అయినప్పటికీ ఏడాదికోసారి వచ్చే రాఖీ పౌర్ణమి రోజున తోబుట్టువులు ఒకచోట చేరి ఆప్యాయంగా మాట్లాడుకోవడం, రాఖీ కట్టుకోవడం, మిఠాయిలు పంచుకోవడంలో ఉన్న ఆనందం ప్రత్యేకమైనది.
సోదరులు అక్కాచెల్లెళ్లకు అండగా, రక్షణగా నిలవాలని.. సోదరీమణులు సోదరుల శ్రేయస్సు, అభ్యున్నతిని కోరుకోవాలనే గొప్ప సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను మరింత పెంచుతూ, బంధాలను బలపరిచే ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని కోరుకుందాం.
మనప్రజాప్రతినిధిదినపత్రికతరపున మీకు మీకుటుంబ సభ్యులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!