“బాలికల్లో ఎంజేపీ చింతమడక..బాలురలో మద్దూర్ మోడల్ స్కూల్ విజేతలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.సెప్టెంబర్22
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఎస్‌జీఎఫ్ పోటీలు చక్కని వేదికగా నిలుస్తున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, అండర్-19 ఎస్‌జీఎఫ్ జిల్లా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న అండర్-19 కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా మైదానంలో ప్రతిభతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి ఎంతో ముఖ్యమన్నారు. గెలుపు ఒక్కటే లక్ష్యంగా కాకుండా పోటీల ద్వారా అనుభవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. విజయం సాధించిన వారు మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలని, విజయం దక్కని వారు నిరుత్సాహపడకుండా మరింత సాధన చేయాలని అన్నారు.
జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాయి. క్రీడాకారుల పట్టుదల, పోరాట పటిమతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి.
బాలికల విభాగంలో ఎంజేపీ చింతమడక జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఎంజేపీ వర్గల్ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. బాలుర విభాగంలో మద్దూర్ మోడల్ స్కూల్ జట్టు ప్రథమ స్థానంలో, చేర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
అనంతరం ఎస్‌జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి మంతెన సమ్మయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలతో కలిసి విజేతలకు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో కబడ్డీ కోచ్ వెంకటేష్, కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి అశోక్, అధ్యాపకులు సుధాకర్ రెడ్డి, కనక చంద్రం, నంట శ్రీనివాస్ రెడ్డితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.