manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:30 pm Posted by : Mana Praja Prathinidhi

బుల్లెట్ బండి వివాదం.హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్

మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్ నవంబర్ 24

చోరీకి గురైన వాహనం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై హుజూర్‌నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ సస్పెండ్ అయ్యారు. ఈ వివాదానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన వనస్థలిపురం పోలీసులు, సాంకేతిక ఆధారాలతో ఆ బైక్ హుజూర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానిక నాయకుల ఒత్తిడికి తలొగ్గిన హుజూర్‌నగర్ ఎస్ఐ నరేష్, స్వాధీనం చేసుకున్న ఆ బుల్లెట్ బండిని నిబంధనలకు విరుద్ధంగా మరో వ్యక్తికి తిరిగి అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వనస్థలిపురం పోలీసులు, జరిగిన విషయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారుల చర్యలు
మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. వనస్థలిపురం పోలీసుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఈ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణలో ఎస్ఐ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వాస్తవమేనని తేలడంతో జిల్లా ఎస్పీ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.