ఎమ్మార్వో మాటకే విలువ లేదా? మహిళల పట్ల దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు.. ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా?
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా ప్రత్యేక కథనం
ఏర్పేడు: ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన కార్యాలయంలోనే మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
మహిళలంటే అంత చులకనా?
ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే మహిళలతో మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగి స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ప్రజల సమస్యలు వినాల్సిన చోట మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు రావడం ఉద్యోగ వ్యవస్థకే మచ్చగా మారుతోంది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మార్వో ఆదేశాలకూ విలువ లేదా?
కార్యాలయంలో ఎమ్మార్వో మాటలను సైతం అటెండర్ బేఖాతరు చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. పై అధికారి సూచనలకే విలువ ఇవ్వని పరిస్థితి ఉంటే కార్యాలయంలో పాలన, క్రమశిక్షణ ఎలా కొనసాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కార్యాలయంలో ఎవరి మాటకు విలువ ఉంది? ఉద్యోగులపై అధికారుల పర్యవేక్షణ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ గారూ.. మహిళల గౌరవం మీకు కనిపించడం లేదా?
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏర్పేడు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌పై వస్తున్న అసభ్య ప్రవర్తన ఆరోపణలపై జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి. బాధిత మహిళల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమగ్ర విచారణ చేపట్టాలి.
ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఉద్యోగిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల వ్యక్తిగత ఇష్టారాజ్యానికి వేదిక కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యతాయుతమైన వ్యవస్థ! మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనకు ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు ఉండకూడదు. ఏర్పేడు కార్యాలయంలో ఈ ఆరోపణలకు అధికారులు ఎప్పుడు సమాధానం చెబుతారు? బాధిత మహిళలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?
ఇదే ఇప్పుడు ఏర్పేడు ప్రజల ప్రశ్న!