“పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలి
“సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్13
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గజేందర్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం ఇమాంబాద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలనే నిబంధనతో రూపొందించిన హేతుబద్ధీకరణ ఉత్తర్వులు 25ను వెంటనే సవరించాలని కోరారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా కొనసాగుతున్న ఆన్‌లైన్ కార్యక్రమాలను, ఇబ్బడిముబ్బడిగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి, ఫిట్‌మెంట్ ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాత యాదగిరి, జిల్లా అధ్యక్షుడు మ్యాడ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్, సిద్దిపేట అర్బన్ అధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, నారాయణరావుపేట అధ్యక్షుడు ఎస్. వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి జె. చంద్రశేఖర్, జిల్లా నాయకులు పి. సుధాకర్, ఎం.డి. అన్వర్ తదితరులు పాల్గొన్నారు.