manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 1:56 am Posted by : Mana Praja Prathinidhi

దేశ అంతర్గత భద్రతకు దిశానిర్ధేశం: అమిత్‌షా

మూడు రోజుల కాన్ఫరెన్స్‌కు హోం మంత్రి అమిత్‌షా ప్రారంభం
దేశ అంతర్గత భద్రతపై సమగ్ర చర్చలకు ఈ వేదిక కీలకం
నక్సల్ ప్రభావిత జిల్లాలు 126 నుంచి 11కి తగ్గాయని కేంద్రం వ్యాఖ్య
రాయ్‌పూర్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
దేశ అంతర్గత భద్రత, నేర నియంత్రణ, వ్యూహాత్మక విధానాల రూపకల్పన సంబంధిత అత్యున్నత స్థాయి సమావేశం అయిన 60వ కాన్ఫరెన్స్ ను కేంద్ర గృహ మరియు సహకారశాఖ మంత్రి అమిత్‌ షా రాయ్‌పూర్‌లో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. అమిత్‌ షా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ కాన్ఫరెన్స్‌ దేశ అంతర్గత భద్రత, వ్యూహాత్మక విధానాల రూపకల్పనలో కీలక వేదికగా మారిందని తెలిపారు. సమస్యల పరిష్కారం నుంచి భద్రతా సవాళ్ల వరకు, పాలసీ నిర్ణయాల వరకు ఈ సమావేశం ఒక సమగ్ర ఆలోచనా వేదికగా పని చేస్తోందన్నారు. దేశంలో నక్సల్ చట్రం గణనీయంగా తగ్గిందని వెల్లడించిన ఆయన, 2014లో నక్సల్ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, ఇప్పుడు కేవలం 11 మాత్రమే మిగిలాయని చెప్పారు. గత ఏడు సంవత్సరాల్లో 586 బలమైన ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం ద్వారా అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం అయ్యిందని వివరించారు. దేశంలో ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, నషా వ్యసనం, అంతర్జాతీయ నేరాలు, సరిహద్దు భద్రత వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం రూపొందిస్తున్న భద్రతా నిర్మాణంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ పాత్ర మరింత కీలకమని అమిత్‌షా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాబోయే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో సాంకేతికత, డేటా అనలిటిక్స్, ఆధునిక శిక్షణ వ్యవస్థల వినియోగంపై కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.