552 మందికి ఉచిత కళ్లద్దాల పంపిణీ
పవన్ కళ్యాణ్ చొరవతో ప్రత్యేక చర్యలు
శుక్లాల శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు
హస్తకళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం
నరసాపురం,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): హస్తకళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నరసాపురం అంతర్జాతీయ లేస్ కేంద్రంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో దృష్టి సమస్యలు గుర్తించిన 552 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వృత్తిపరంగా కంటి చూపుపై ఆధారపడే కళాకారులకు పెద్ద ఊరట లభించింది. పది రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరంలో సుమారు 700 మంది కళాకారులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించారు. కంప్యూటరైజ్డ్ పవర్ టెస్టులు, కంటి ఒత్తిడి పరీక్షలు, రెటీనా స్కానింగ్, స్లిట్ ల్యాంప్ పరీక్షల ద్వారా వారి కంటి ఆరోగ్యాన్ని పరిశీలించారు. పరీక్షల అనంతరం 552 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టారు.
కళాకారులకు తమకు నచ్చిన ఫ్రేములను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలను కేవలం పది రోజుల్లోనే అందజేశారు. దీంతో రోజువారీ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, మరింత సమర్థంగా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించగలమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. శిబిరంలోనే 45 మందికి కంటి శుక్లాల సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిలో 12 మందికి ఇప్పటికే కాకినాడలోని ప్రత్యేక కంటి ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆచంట, అత్తిలి తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి హస్తకళాకారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సలు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. చేతిపనులపై ఆధారపడి జీవించే క్రోచెట్ లేస్ కళాకారులకు మెరుగైన కంటి చూపు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ, వైద్య సేవల కల్పన వారి జీవనోపాధికి తోడ్పడటంతో పాటు సంప్రదాయ హస్తకళల పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.