manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:38 am Posted by : Mana Praja Prathinidhi

మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రా మహోత్సవం

°భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అన్నప్రసాద వితరణ
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఆగస్టు11
మండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో గల శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో సోమవారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు గణపతిపూజ, స్వస్తివాచనం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్రకలశ స్థాపన కార్యక్రమాలను చేపట్టారు.
స్థాపిత దేవతల పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. విజయదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మోహనకృష్ణశర్మ, వేదవ్యాస్ శర్మల వైదిక నిర్వహణలో కార్యక్రమాలు కొనసాగాయి. ఋత్విజులుగా బి. లక్ష్మణరావు, కృష్ణకిషోర్ పాండే వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు సి.హెచ్. నరసింహారెడ్డి, చీకోటి రాజేంద్రప్రసాద్, మర్యాల వీరేశం, దేవసాని మల్లేశం, తిరుపతిరెడ్డితో పాటు పలువురు భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.