manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 6:24 pm Posted by : Mana Praja Prathinidhi

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవని శేఖర్ నియామకం

మనప్రజాప్రతినిధి//హైదరాబాద్, ఆగస్టు 3

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవని శేఖర్ను రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అధికారికంగా నియమించారు. ఈ నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ దేవని శేఖర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవని శేఖర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల హక్కుల సాధన, యువత అభివృద్ధి కోసం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని దేవని శేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో యువతను పార్టీ వైపు ఆకర్షించి, బలమైన యువజన శక్తిని నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి యువకుడు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిరుద్యోగం, విద్య, ఉపాధి, సామాజిక అసమానతలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ తరఫున ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర యూత్ వింగ్‌తో కలిసి సమన్వయంతో పనిచేస్తానని అన్నారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడం, రాజ్యాంగ విలువలను కాపాడడం, సామాజిక మార్పు కోసం యువశక్తిని సమీకరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీతో, క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తానని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మిత్రులకు దేవని శేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తతో కలిసి ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.