manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:11 pm Posted by : MANA PRAJA PRATINIDHI

ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు

వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు
రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
జంపన్న వాగులో భక్తుడు గల్లంతు
లోతట్టు ప్రాంతాల్లో వరదల ముప్పు

హైదరాబాద్, జూలై 30 (మనప్రజాప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆయా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే తదుపరి పరిస్థితులను సమీక్షించి మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కన్నాయిగూడెం ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో వరద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వరద బాధితుల కోసం అత్యవసర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రమాద ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేడారంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగులో స్నానం చేసేందుకు దిగిన ఘట్‌కేసర్‌కు చెందిన ఓ భక్తుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు స్పందన బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. అయితే వాగులో ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.