సీఎం వ్యాఖ్యలపై సుష్మిత అభ్యంతరం
కొండా మురళికి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణ
అధిష్ఠానమే అభ్యర్థులను నిర్ణయిస్తుందన్న వ్యాఖ్య
హైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అభ్యర్థిత్వంపై ప్రకటనలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. పరకాల నియోజకవర్గంలో మరోసారి రేవూరి ప్రకాశ్‌రెడ్డికే టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారని సుష్మిత ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానం పరిధిలో ఉంటుందని, వ్యక్తిగతంగా ఎవరూ నిర్ణయాలు ప్రకటించలేరని అన్నారు. స్థానిక స్థాయిలో ప్రజల అభిప్రాయాలు, పార్టీ పరిస్థితులు, నాయకుల పనితీరును పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
తన తండ్రి కొండా మురళిని పార్టీ నాయకత్వం పక్కన పెడుతోందని సుష్మిత ఆరోపించారు. కొండా మురళి సాధారణ రాజకీయ నాయకుడు కాదని, అనేక రాజకీయ పరిణామాలకు కీలక పాత్ర పోషించిన నాయకుడని చెప్పారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో మొదటగా మద్దతు తెలిపింది కొండా దంపతులేనని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా తమ కుటుంబానికి తగిన గుర్తింపు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని సుష్మిత పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. సంగారెడ్డి వంటి నియోజకవర్గాల విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పే నాయకత్వం, పరకాల విషయంలో మాత్రం ముందస్తు ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై పార్టీ స్పష్టత ఇవ్వాలని కోరారు.
యువతకు అవకాశాలు కల్పించాలని మాట్లాడే నాయకులు, ఇప్పటికే పదవిలో ఉన్న నాయకులకే మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడం విరుద్ధ ధోరణి అని ఆమె వ్యాఖ్యానించారు. బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు. రాజకీయ నాయకత్వంలో సమతుల్యత, నిబద్ధత అవసరమని పేర్కొంటూ పలు అంశాలపై సీఎం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా సుష్మిత విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొందరు నాయకులు అధిక ప్రభావం చూపుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. పరకాల టికెట్ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.