Monday, March 2, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్చీకటిలో వాయులింగుని దర్శనం… కన్నీటితో కైలాసగిరి గిరి ప్రదక్షిణ – భక్తుల వేదన

చీకటిలో వాయులింగుని దర్శనం… కన్నీటితో కైలాసగిరి గిరి ప్రదక్షిణ – భక్తుల వేదన

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్21
వాయులింగేశ్వరుడు కొలువున్న క్షేత్రం మహిమ అపారమైనది… కానీ ఆ మహిమను అనుభవించేందుకు వచ్చే భక్తుల కష్టాలను పట్టించుకునే వారు లేరా?” అని శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.22 కిలోమీటర్ల మేర విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణి గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు స్వయంగా గిరి ప్రదక్షిణ చేసి ఈ క్షేత్ర మహిమను వివరించినా, భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని భక్తులు వాపోతున్నారు.ప్రత్యేకంగా నుంచి వచ్చే వేలాది మంది భక్తులు సరైన రహదారులు, లైటింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు లేకపోయినా, చీకటిలోనే అడుగులు వేస్తూ గిరి ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు సైతం భయంతోనే గిరి ప్రదక్షిణ సాగిస్తున్నారని చెబుతున్నారు. “భగవంతుడిపై నమ్మకమే మా ధైర్యం… ప్రభుత్వ ఏర్పాట్లు కాదు” అని కొందరు భక్తులు కన్నీటితో చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.కైలాసగిరి చుట్టూ ఉన్న పనసకోన, హరహరకోన,  వెయ్యి లింగాల కోన వంటి పవిత్ర ప్రదేశాలు కనబడుతున్నా, అక్కడికి వెళ్లే మార్గాలు తెలియక అభివృద్ధి కి నోచుకోకపోవడం వల్ల, అనేక మంది భక్తులు వాటి మహిమ తెలియకుండానే వెనుదిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11 గ్రామాలకు చెందిన మండపాలు ఉన్నప్పటికీ, విశ్రాంతి తీసుకునే కనీస సౌకర్యాలు లేకపోవడం భక్తులకు శ్రమగా మారిందని అంటున్నారు.
“అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది… అదే స్థాయి ఆధ్యాత్మిక శక్తి ఉన్న శ్రీకాళహస్తిని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత అన్నీ ఉన్నా, అధికారిక గుర్తింపు లేకపోవడం వల్ల ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ అజ్ఞాతంలో మిగిలిపోతోందని వాపోతున్నారు.శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, రహదారులు, లైటింగ్, త్రాగునీరు, భద్రత వంటి మౌలిక వసతులు కల్పిస్తే, భక్తుల కన్నీరు ఆనందంగా మారుతుందని టీవీ4 తెలుగు న్యూస్ ఛానల్ & ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారి రమేష్ పేర్కొన్నారు.ఇటీవల శ్రీకాళహస్తి ఆలయానికి విశేష గుర్తింపు తీసుకువచ్చిన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ అంశంలోనూ చొరవ తీసుకుని, భక్తుల వేదనకు ముగింపు పలుకుతారని భక్తులు, నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular