– జూబ్లీహిల్స్ నియోజకవర్గ హామీలపై సమీక్ష
– మైనార్టీల శ్మశాన వాటికల సమస్యకు త్వరిత పరిష్కారం
– ఆక్రమణలపై కఠిన చర్యలకు ఆదేశం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30 (మనప్రజాప్రతినిధి):
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్ & ఐఅండ్పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ఇతర కీలక అంశాలపై సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సహచర మంత్రి మహ్మద్ అజారుద్దీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ సమస్యను వీలైనంత త్వరితగతిన రక్షణ శాఖ, రెవెన్యూ శాఖ, వక్ఫ్ బోర్డు సమన్వయంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ భూమిని రక్షణ శాఖకు బదలాయించి, వారి నుంచి ప్రత్యామ్నాయ భూమిని తీసుకోవాలని, అలాగే అనుకూలమైన భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పారు.
ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే భూములను ఖాళీ చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివాదాల్లో ఉన్న భూముల పరిరక్షణకు న్యాయపరంగా ఎదుర్కొని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీల్లాహ్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదు
RELATED ARTICLES

