•రుణమాఫీ,పంట బీమాపై మౌనం-రైతులపై మరో ద్రోహం
•ఆకలి, అప్పులు, ఆత్మహత్యల మధ్య రైతును విస్మరించిన విధానాలపై తీవ్ర విమర్శలు
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3
ఆకలి, అప్పులు, ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతుకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మారెడ్డి రాంలింగారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతు ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా రూపొందిన తాజా కేంద్ర బడ్జెట్ రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆయన పేర్కొన్నారు.గిట్టుబాటు ధరలు లేని పంటలు, ప్రైవేట్ అప్పుల భారంతో నలిగిపోతున్న రైతులు, ప్రకృతి వైపరీత్యాలతో క్షణాల్లో కూలిపోతున్న జీవనాధారం వంటి సమస్యలు రైతును వెంటాడుతున్నప్పటికీ, వాటికి పరిష్కారం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతు సంక్షేమాన్ని పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ రైతులపై జరిగిన తేటతెల్లమైన ద్రోహమని విమర్శించారు.
చట్టబద్ధ కనీస మద్దతు ధరపై మౌనం
రైతులకు చట్టబద్ధమైన, లాభసాటి కనీస మద్దతు ధర హామీ ఇవ్వాల్సిన కీలక సమయంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా మౌనం పాటించిందని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ లేకుండా రైతు ఆదాయ భద్రత సాధ్యం కాదని, అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం రైతును మార్కెట్ దోపిడీకి అప్పగించినట్లేనని మండిపడ్డారు. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదని, స్పష్టమైన విధాన వైఫల్యమని తెలిపారు.
రుణ సంక్షోభంపై స్పందన లేని వైఖరి
దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేళ సమగ్ర రుణమాఫీ, వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు బడ్జెట్‌లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ రైతు రుణ సంక్షోభానికి కేంద్ర బడ్జెట్ ఎలాంటి స్పష్టమైన దిశను చూపలేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న అప్పుల వ్యవస్థను అలాగే కొనసాగించడం నేరపూరిత నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
పంట బీమా పేరుకే పరిమితం
ప్రకృతి వైపరీత్యాలు రైతు జీవితాన్ని క్షణాల్లో నేలచూపిస్తున్నప్పటికీ, పంట బీమా పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో రైతుకు నమ్మకం లేకుండా పోయిందని, అయినా బడ్జెట్‌లో పంట బీమా సంస్కరణలపై గట్టి చర్యలు లేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని బట్టబయలు చేస్తోందన్నారు.
మౌలిక వసతులపై నిర్లక్ష్యం
సాగునీటి ప్రాజెక్టులు, చిన్నతరహా సాగునీటి పథకాలు, తుంపర సాగు విధానాలు, గ్రామీణ గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లకు తగిన నిధులు కేటాయించకపోవడం రైతు ఆదాయాన్ని మాత్రమే కాకుండా రైతు భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టే చర్యగా మారిందని విమర్శించారు.
డిమాండ్లు
రైతు సంక్షేమం దయ కాదని, దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే రైతు బతకాల్సిందేనని మారెడ్డి రాంలింగారెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక బడ్జెట్ విధానాలను సవరించి,
చట్టబద్ధమైన కనీస మద్దతు ధర
సమగ్ర రుణమాఫీ
వేగవంతమైన పంట బీమా నష్టపరిహారం
సాగునీటి వ్యవసాయ మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు
తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మారెడ్డి రాంలింగారెడ్డి
సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రైతు రక్షణ సమితి

