మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి14
యాసంగి పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచినా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫల మైందని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15,000 అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, కౌలు రైతులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని అన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. 2024 ఖరీఫ్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం ఇంకా జమ కాలేదని, డిసెంబర్–జనవరి నెలల్లో జమ చేయాల్సిన యాసంగి సాయం కూడా విడుదల కాలేదని ఆయన విమర్శించారు.రాబోయే పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా అంశాన్ని మళ్లీ ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన, రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బాకీ ఉన్న పెట్టుబడి సాయాన్ని విడుదల చేయక పోతే పార్టీ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బత్తిని సాయ గౌడ్, జిల్లా నాయకురాలు కొలనురు ముత్తవ్వ, నాయకులు పినికాసి అనిల్, భూత్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి కమలాకర్ రావు, పిల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
యాసంగి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలి: భూమల్ల అనిల్ కుమార్, భారతీయ జనతా పార్టీ
RELATED ARTICLES

